న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడకుండా వెటరన్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబేపై అనర్హత వేటు పడింది. బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించడంతో అతడిపై ఈ మేరకు చర్య తీసుకున్నారు. ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించింది. ‘అతడిని (తాంబే)ను ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతించం. బీసీసీఐ, రాష్ట్రాల క్రికెట్ బోర్డుల నుంచి నిరంభ్యంతర సర్టిఫికెట్ తీసుకువచ్చిన ఆటగాళ్లకే ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఉంటుంద’ని ఆయన స్పష్టం చేశారు.
48 ఏళ్ల ప్రవీణ్ తాంబే.. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన పెద్ద వయస్కుడిగా నిలిచాడు. ఐపీఎల్ 2020 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 20 లక్షల కనీస ధరకు అతడిని దక్కించుకుంది. 2013-16 మధ్య కాలంలో 33 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన తాంబే 28 వికెట్లు పడగొట్టాడు. 2014లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగి 15 వికెట్లు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరపున కూడా ఆడాడు. తనను తాను 20 ఏళ్ల వయస్కుడిగా భావించుకుంటానని గత డిసెంబర్‌లో ఐపీఎల్ వేలం తర్వాత పేర్కొన్నాడు. యువకుడిగా మైదానంలోకి దిగుతానని.. తన అనుభవం, ఎనర్జీ కేకేఆర్ జట్టుకు ఉపయోగపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. తుది జట్టులోకి తీసుకోకపోయినా, తనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధమని ప్రకటించాడు. అయితే తాంబే స్థానంలో కేకేఆర్ ఎవరినీ తీసుకుంటుందో ఇంకా వెల్లడి కాలేదు.